అమెరికాలో వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్‌కార్డు ప్రక్రియలో కొత్త ఆంక్షలు విధించడం భారత ఐటీ రంగంపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా అమెరికాలో పనిచేయాలనుకునే భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అనిశ్చితి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.
అమెరికాకు ఉద్యోగులను పంపించడంపై ఆధారపడటానికి బదులుగా భారత్‌లోనే ఎక్కువ మందిని నియమించుకుని, ఇక్కడి నుంచే విదేశీ ప్రాజెక్టులను నిర్వహించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికా కార్మిక శాఖ, మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్‌టెక్, క్యాప్‌జెమినీ వంటి ఎనిమిది టెక్నాలజీ సంస్థలకు సంబంధించి పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) కార్యక్రమంలో కొత్త దరఖాస్తులు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు పొందేందుకు ఈ ప్రక్రియ కీలకమైన తొలి దశ.
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే హెచ్-1బీ వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసాలు తక్షణమే రద్దు కావు. వారి ఉద్యోగాలపైనా నేరుగా ప్రభావం ఉండదు. అయితే భవిష్యత్తులో శాశ్వత నివాస హోదా పొందాలనుకునే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలంగా అమెరికాలో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన భారతీయ నిపుణులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో స్థానిక నియామకాలు అంత సులభం కాదు
వీసా నిబంధనల నేపథ్యంలో అమెరికాలోనే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నప్పటికీ, అది అంత సులభమైన విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను పెద్ద సంఖ్యలో గుర్తించడం, వారికి తగిన వేతనాలు చెల్లించడం ఐటీ సంస్థలకు భారంగా మారవచ్చు. భారత్ నుంచి ఉద్యోగులను పంపించడం కంటే అమెరికాలో స్థానికంగా నియామకాలు చేపట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని చెబుతున్నారు.
సిబ్బంది నియామక సంస్థ ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరాంత్ అభిప్రాయం ప్రకారం, అమెరికాలో స్థానిక ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడం నైపుణ్యాల సరిపోలిక, వ్యయ నియంత్రణ పరంగా సవాళ్లతో కూడుకున్నది. అందువల్ల సమీప భవిష్యత్తులో భారతీయ ఐటీ సంస్థలు అమెరికాలో భారీగా స్థానిక నియామకాలు చేపడతాయని భావించలేమని పేర్కొన్నారు. దీనికి బదులుగా భారత్‌లోని కార్యాలయాల నుంచే అమెరికా ప్రాజెక్టులను నిర్వహించే విధానానికి సంస్థలు ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బెంగళూరు, హైదరాబాద్‌కు కొత్త అవకాశాలు
ఈ పరిణామాలు భారతీయ సాంకేతిక కేంద్రాలకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగ నియామకాలు పెరగవచ్చని అంచనా. అమెరికాకు ఉద్యోగులను పంపించడానికి బదులుగా ఆయా సంస్థలు భారత్‌లోనే సిబ్బందిని నియమించుకుని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను అప్పగించవచ్చు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై విధించిన ఆంక్షల ప్రభావంతో భారతీయ ఐటీ సంస్థలు తమ ఉద్యోగ నియామక విధానాలను మార్చుకుంటున్నాయి. తాజాగా పీఈఆర్ఎం దరఖాస్తుల నిలిపివేత కూడా ఈ మార్పును వేగవంతం చేసే అవకాశం ఉందని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరాంత్ పేర్కొన్నారు.

