దేశంలో చక్కెర ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చక్కెర కనీస విక్రయ ధరను ప్రస్తుతం ఉన్న కిలో రూ.31 నుంచి రూ.42కు పెంచాలని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ () కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గత 20 ఏళ్లుగా కనీస విక్రయ ధరలో ఎలాంటి మార్పు లేదని, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరను సవరించాల్సిన అవసరం ఉందని సంఘం పేర్కొంది.
ఈ ప్రతిపాదన అమలైతే చక్కెర మిల్లులకు లభించే కనీస విక్రయ ధర పెరుగుతుంది. అయితే వినియోగదారులకు రిటైల్ ధరలు వెంటనే రూ.42కు పెరుగుతాయని చెప్పలేం. మాజీ నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ర నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీకి ఏఐఎస్‌టీఏ ఈ ప్రతిపాదనలు సమర్పించింది. చెరకు రైతుల సమస్యలు, ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై పరిశీలన చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చక్కెర కనీస విక్రయ ధర క్వింటాల్‌కు రూ.3,100గా ఉంది. దీనిని రూ.4,200కు పెంచాలని ఏఐఎస్‌టీఏ ఛైర్మన్ ప్రఫుల్ విఠలానీ కోరారు. అంటే కిలోకు రూ.11 పెంపు, సుమారు 35 శాతం పెరుగుదల అవుతుంది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చక్కెర విక్రయించాల్సిన పరిస్థితి మిల్లులకు రాకుండా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. 2026-27 సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం చెరకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ()ను క్వింటాల్‌కు రూ.365గా నిర్ణయించింది. 10.25 శాతం చక్కెర రికవరీ రేటు ప్రాతిపదికన ఈ ధరను ఖరారు చేశారు. ఈ ధరను పరిశ్రమ వర్గాలు గతంలో విస్తృతంగా ఆమోదించాయని ఏఐఎస్‌టీఏ పేర్కొంది.
గుజరాత్లో అమలవుతున్న చెల్లింపుల విధానాన్ని పరిశీలించాలని సంఘం సూచించింది. దీని ప్రకారం రైతులకు రెండు ఎంపికలు ఇవ్వాలని కోరింది. చెరకు సరఫరా చేసిన 7 నుంచి 14 రోజుల్లో పూర్తి చెల్లించడం లేదా మూడు విడతల్లో చెల్లింపులు అంగీకరిస్తే తో పాటు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇవ్వడం. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చక్కెర మిల్లులు ఇథనాల్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భారీగా రుణాలు తీసుకున్నాయి. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ప్రభావితమైతే ఇథనాల్ తయారీకి అవసరమైన ముడిసరుకు తగ్గుతుందని సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇథనాల్ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం విధించాలని కోరింది. అలాగే ఈ కాలానికి వడ్డీ రాయితీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో చక్కెర ఉత్పత్తి అంచనాల కంటే తగ్గడం, చెరకు పంటకు తెగుళ్లు, అధిక వర్షాల వల్ల పంట నష్టం, పండుగల సమయంలో పెరిగిన డిమాండ్ వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం గతంలో చక్కెర నిల్వలపై పరిమితులు విధించడం, దిగుమతులకు అనుమతించడం వంటి చర్యలు చేపట్టింది.


