దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కీలక వ్యాపార సమాచారం బయటకు వెళ్లినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఇద్దరు సీనియర్ అధికారులు రహస్య వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌పై ప్రభావం చూపగల సమాచారాన్ని బయటి వ్యక్తులతో పంచుకున్నారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత సమీక్ష కొనసాగుతోంది.
బ్యాంకులోని కొందరు ఉన్నతాధికారులు రహస్య సమాచారం బయటకు వెళ్తోందనే అనుమానాలు వ్యక్తం చేయడంతో అంతర్గత దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో ఇద్దరు సీనియర్ అధికారులను గుర్తించినట్లు, వారు బ్యాంకులో కీలక వ్యాపార విభాగాలు, విధులకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వారి ద్వారా బయటకు వెళ్లినట్లు భావిస్తున్న సమాచారం వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశమున్న వివరాలకు సంబంధించినదిగా పేర్కొన్నారు. అయితే, ఆ సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేశారా దాని వల్ల బ్యాంకుకు లేదా మార్కెట్లోని ఇతర వర్గాలకు ఎలాంటి ప్రభావం ఏర్పడిందా అనే అంశాలపై పరిశీలన కొనసాగుతోంది.
యాజమాన్యానికి నివేదిక
అంతర్గత విచారణకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది ప్రారంభంలోనే బ్యాంకు సీనియర్ యాజమాన్యానికి, బోర్డు సభ్యుల్లో కొందరికి తెలియజేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. విచారణలో గుర్తించిన అంశాల గురించి సంబంధిత ఇద్దరు అధికారులకు కూడా అధికారికంగా సమాచారం అందించినట్లు తెలిపింది.
అయితే, వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. విచారణ పూర్తయ్యాక, అందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. కొనసాగుతున్న అంతర్గత సమీక్షకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని, విచారణ ప్రక్రియ సమగ్రతతో పాటు సంబంధిత వ్యక్తుల గోప్యతను కాపాడాల్సి ఉందని బ్యాంకు పేర్కొంది.
నాయకత్వ మార్పు వేళ పరిణామం
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శశిధర్ జగదీశన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త నాయకత్వ బాధ్యతల మార్పునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐసీఐసీఐ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం ఉన్న అనుప్ బాగ్చి న కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి బాధ్యతలు చేపట్టనున్నట్లు నివేదికలు తెలిపాయి.
ఈ ఏడాది మార్చిలో బ్యాంకు అప్పటి పార్ట్‌టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన వ్యక్తిగత విలువలు, కొన్ని బ్యాంకు విధానాల మధ్య విభేదాలు ఉన్నాయని పేర్కొంటూ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన లేవనెత్తిన అంశాలపై బ్యాంకు స్వతంత్ర న్యాయ సమీక్షను చేపట్టింది. ఆ సమీక్షలో ఆయన అభ్యంతరాలకు మద్దతు ఇచ్చే ఆధారాలు లభించలేదని బ్యాంకు గతంలో వెల్లడించింది. ప్రస్తుత రహస్య సమాచార లీక్ వ్యవహారం మాత్రం ప్రత్యేకంగా విచారణలో ఉన్న అంశం.
నైతిక ప్రమాణాలపై బ్యాంకు ప్రకటన
బ్యాంకులో నైతిక విలువలు, పాలనా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధి తెలిపారు. సంభావ్య ఉల్లంఘనలపై వచ్చే ప్రతి ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తామని, అంతర్గత విధానాల ప్రకారం అన్ని సంబంధిత వాస్తవాలను సేకరించి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్ష పూర్తయ్యాక దాని ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.












