భారతీయ మొబైల్ బ్రాండ్ కార్బన్ కొంతకాలం విరామం తర్వాత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తిరిగి వచ్చింది. రెబెల్, రెబెల్ ప్రో పేర్లతో రెండు కొత్త 4జీ ఫోన్లను విడుదల చేసింది. పెద్ద బ్యాటరీలు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. రెబెల్ 5జీ మోడల్‌ను త్వరలో పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
కార్బన్ రెబెల్ స్మార్ట్‌ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రధాన కెమెరా ఉంది.
ఈ ఫోన్లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంటుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ కూడా కల్పించారు. నీలం, బంగారం, వెండి రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
రెబెల్ ప్రో ప్రత్యేకతలు
రెబెల్ ప్రోలో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఇందులోనూ మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్‌నే ఉపయోగించారు.
కెమెరా విభాగంలో 64 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్. 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. చెర్రీ రెడ్, నీలం, బంగారం, బూడిద రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ధరలు, విక్రయాలు
కార్బన్ రెబెల్ ప్రారంభ ధర రూ.11,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.10,999కు లభిస్తుంది. కార్బన్ రెబెల్ ప్రో ప్రారంభ ధర రూ.12,499 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ.11,499కు లభిస్తుంది. ఈ రెండు ఫోన్ల గరిష్ఠ చిల్లర ధర రూ.14,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ ద్వారా నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తున్నారు. అనవసరమైన ముందస్తు యాప్‌లు లేకుండా స్వచ్ఛమైన సాఫ్ట్వేర్ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ తెలిపింది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ నవీకరణలు, నాలుగేళ్ల భద్రతా నవీకరణలు అందిస్తామని ఫోన్ల ప్రారంభ వివరాల్లో పేర్కొంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కూడా ఉన్నాయి.
త్వరలో కార్బన్ రెబెల్ 5జీ
రెబెల్ సిరీస్‌లో 5జీ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు కార్బన్ ప్రకటించింది. అయితే ఆ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర, విక్రయ తేదీని ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం విడుదలైన రెబెల్, రెబెల్ ప్రో మాత్రం 4జీ మోడళ్లే.
భారతీయ మొబైల్ బ్రాండ్ కార్బన్, రెబెల్ మరియు రెబెల్ ప్రో అనే రెండు కొత్త 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి. రెబెల్ ఫోన్ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రూ.11,999 ప్రారంభ ధరతో, రెబెల్ ప్రో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రూ.12,499 ప్రారంభ ధరతో లభిస్తాయి.












