చికిత్స కోసం వాడాల్సిన ఔషధాలే వ్యసనానికి దారితీస్తున్నాయని, యువతను మత్తుకు బానిసలుగా మార్చే హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అక్రమ దందాపై తెలంగాణ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్స్ వింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో మత్తుమందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. మెడికల్ షాపుల ముసుగులో మత్తు మందుల వ్యాపారం సాగుతోందా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో ఇవ్వాల్సిన మందులు అడ్డదారిలో అమ్ముతున్నారా అన్న కోణంలో టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.
హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలా నగర్, మేడిపల్లి, షామీర్పేట ప్రాంతాల్లో మెడికల్ షాపులను జల్లెడ పట్టింది. రాష్ట్రంలోని జిల్లాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. కొనుగోళ్లు, అమ్మకాలకు పక్కా రికార్డులు ఉన్నాయా అని అధికారులు ఆరా తీశారు.
హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అమ్మకాలపై నిఘా
ఈ స్పెషల్ డ్రైవ్‌లో ప్రధానంగా హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అమ్మకాలపై అధికారులు నిఘా పెట్టారు. ట్రామడాల్, ఆల్ప్రా జోలం, నైట్రాజెపామ్, టాపెంటడాల్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్తో పాటు కోడిన్ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయాలను పరిశీలించారు. డాక్టర్ చీటీ లేకుండా ఈ మందులను విక్రయిస్తున్నారా కొనుగోళ్లు, అమ్మకాలకు పక్కా రికార్డులు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీశారు.
నిబంధనల ఉల్లంఘనలు
అధికారుల తనిఖీల్లో మెడికల్ షాపుల నిబంధనల ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వడం, బిల్లులు జారీ చేయకపోవడం వంటి అక్రమాలను గుర్తించారు. షెడ్యూల్ హెచ్1 డ్రగ్స్ రిజిస్టర్లు నిర్వహించకపోవడంతో పాటు కొనుగోళ్లు, అమ్మకాల లెక్కల్లోనూ తేడాలు బయటపడ్డాయి.
దీంతో నిబంధనలు ఉల్లంఘించిన 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఆధారంగా డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్, రద్దుతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












