మణుగూరు ప్రాంతంలో గిరిజనులను అడ్డుపెట్టుకొని కొందరు వ్యక్తులు మద్యం, ఇసుక, క్రషర్లు, వడ్డీ వ్యాపారాలు, చిట్టీ వ్యాపారాలు వంటి పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రేణుక అక్షర మహిళా మండలి ఆరోపించింది.
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూణెం సరోజ విడుదల చేసిన ప్రకటనలో, కొందరు వ్యక్తులు బినామీలను ఉపయోగించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, అక్రమ చిట్టీల పేరుతో ప్రజల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు సేకరిస్తున్నారని ఆరోపించారు.
మద్యం వ్యాపారంలోనూ గిరిజనుల పేర్లను దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమ క్రషర్ల ద్వారా సహజ వనరులను నష్టపరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి, సమగ్ర విచారణ జరపాలని సరోజ డిమాండ్ చేశారు.
ఇసుక ర్యాంపుల నుంచి మద్యం వ్యాపారం వరకు అనేక రంగాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అక్రమాలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గిరిజనుల పేర్లను దుర్వినియోగం చేసేవారిని సహించబోమని హెచ్చరించారు.
మణుగూరు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ఆరోపించిన బడాబాబులపై ఇంటిలిజెన్స్, విజిలెన్స్, కలెక్టర్, ఎస్పీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని రేణుక అక్షర మహిళా మండలి డిమాండ్ చేసింది.








