మణుగూరు ఏరియాలో అక్రమ ఫైనాన్స్ మాఫియా, అధిక వడ్డీ వ్యాపారాలు పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నాయని రేణుక అక్షర మహిళా మండలి ఆరోపించింది. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ మాట్లాడుతూ, మణుగూరు ఏరియాలో అక్రమ ఫైనాన్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందని, బడా బాబులు, వడ్డీ వ్యాపారుల ఆర్థిక దాహానికి సామాన్యులు బలైపోతున్నారని ఆరోపించారు. స్థానికంగా కొందరు బడా బాబులు ఫైనాన్స్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారని, కేవలం మణుగూరు పట్టణంలోనే అక్రమంగా కోటి, అరకోటి రూపాయల విలువైన చిట్టీలు నడుస్తున్నాయని ఆమె తెలిపారు.
అంతేకాకుండా, మరికొంతమంది నూటికి ఆరు రూపాయల నుండి పది రూపాయల వరకు అధిక వడ్డీని వసూలు చేస్తున్నారని సరోజ పేర్కొన్నారు. మధ్యతరగతి, సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారస్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని, గ్రామాల నుండి పట్టణాల దాకా అక్రమ ఫైనాన్స్ దందా కొనసాగుతోందని ఆమె విమర్శించారు.
ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన కొందరు వ్యక్తులు రోజువారీ ఫైనాన్స్, వారపు ఫైనాన్స్, వంద రోజుల ఫైనాన్స్ వంటి అనేక రకాల అక్రమ వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నారని సరోజ ఆరోపించారు. ఈ అక్రమ వ్యాపారాల వల్ల ఎంతోమంది బాధితులు అవుతున్నారని ఆమె అన్నారు.
వెంటనే ఏజెన్సీలో జరుగుతున్న అక్రమ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సరోజ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.








