మానుగూరు, 25-07-2026
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనతో మనోవేదనకు గురై అమరులైన విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తూ మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదన కలిగించింది. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై అమరులైన విద్యార్థులను స్మరించుకుంటూ, వారికి సంఘీభావం తెలియజేస్తూ మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.
ఏఐసీసీ, టీపీసీసీ మరియు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, మణుగూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు న్యాయం జరిగేలా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, బాధ్యత ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే విద్యార్థుల ఆశయాలను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం అందరూ చేతుల్లో కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటిస్తూ నీట్ పేపర్ లీకేజ్ వల్ల అమరులైన విద్యార్థులను స్మరించుకొని వారికి సంఘీభావం ప్రకటిస్తూ ఘనంగా నివాళులర్పించారు.









