పినపాక, జూలై 22
పినపాక మండలం పెంటన్నగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ. 3.5 లక్షల వ్యయంతో నిర్మించిన బాత్రూంలు మూడేళ్లుగా బిల్లులు ఆన్లైన్ కాకపోవడంతో వాడుకలోకి రాలేదు. దీంతో విద్యార్థులు బయటకు వెళ్లాలంటే పాములు, పొలాల భయం వెంటాడుతోంది.
మూత్రశాలలున్నా మారని విద్యార్థుల తలరాత: మూడేళ్లుగా అందని బిల్లులు.. మూలనపడ్డ బాత్రూంలు! పినపాక మండలం పెంటన్నగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే పాములు, పొలాల భయం వెంటాడుతోంది. అధికారులు, ఎమ్మెల్యే స్పందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మండల పరిధిలోని పెంటన్నగూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) లో చిన్నారి విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మూత్రశాలలు కేవలం కాగితాలకే పరిమితమై, వాడుకకు నోచుకోకపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
గత 2024 లో అప్పటి కలెక్టర్ ప్రియాంక చొరవతో 'అమ్మ ఆదర్శ పాఠశాల' కమిటీ ద్వారా, MGNREGS (ఉపాధి హామీ పథకం) కింద రూ. 3.5 లక్షల వ్యయంతో బాలురు మరియు బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శంకర్ పూర్తి చేశారు. అయితే, నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా.. సదరు బిల్లులు ఆన్లైన్ కావడం లేదనే సాకుతో అధికారులు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ను తిప్పుతున్నట్లు సమాచారం. దీంతో సదరు టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచడంతో అవి వాడుకలోకి రాలేదు.
పాఠశాల చుట్టూ పొలాలు, చెట్లు దట్టంగా పెరిగిపోయాయి. బాత్రూంలు అందుబాటులో లేకపోవడంతో చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో పాములు మరియు ఇతర విషకీటకాల సంచారం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. అటు బాత్రూంలు వాడుకునే పరిస్థితి లేక, ఇటు బయటకు వెళ్లే ధైర్యం లేక చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై ఉన్నతాధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పెండింగ్లో ఉన్న బాత్రూమ్ బిల్లులను వెంటనే విడుదల చేయించి, తాళాలు తీసి వాటిని విద్యార్థుల వాడుకలోకి తీసుకురావాలని, చిన్నారుల ఆరోగ్యాలు మరియు భద్రతను కాపాడాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.










