దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను బంధించడం, వాటి రెక్కలను కత్తిరించడం, బోనుల్లో ఉంచి ప్రదర్శించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ పేరుతో పక్షులను హింసించడం, వాటిని అక్రమంగా విక్రయించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
పండుగ అంటే ఆనందం, స్వేచ్ఛ, ఇతర ప్రాణుల పట్ల కరుణ చూపించడమని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా సందేశం ఇచ్చారు. తెలంగాణలో విజయదశమి రోజున పాలపిట్టను చూడటం శుభసూచకమనే నమ్మకం చాలాకాలంగా ఉంది. అయితే, ఈ సంప్రదాయం పేరుతో కొందరు పాలపిట్టలను పట్టుకుని, రెక్కలను కత్తిరించి, బోనుల్లో బంధించి ప్రదర్శిస్తున్నట్లు సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. పక్షులకు ఆహారం, నీరు అందించకుండా ఇబ్బందులకు గురిచేయడం క్రూరమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. పాలపిట్టలు పర్యావరణ సమతుల్యతకు తోడ్పడటంతో పాటు, పంటలకు హాని చేసే కీటకాలను తింటూ రైతులకు మేలు చేస్తాయని ఆయన వివరించారు. సంప్రదాయాలను పాటిస్తూనే వన్యప్రాణుల స్వేచ్ఛను కాపాడాలని ఆయన సూచించారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం1972 ప్రకారం, రక్షిత పక్షులను అక్రమంగా పట్టుకోవడం, బంధించడం, విక్రయించడం వంటి చర్యలు చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని సజ్జనార్ హెచ్చరించారు. బంధించిన పాలపిట్టల ప్రదర్శనలను ప్రోత్సహించవద్దని ఆయన ప్రజలను కోరారు. పక్షులను కొనుగోలు చేయడం ద్వారా అక్రమ వ్యాపారానికి పరోక్షంగా మద్దతు ఇవ్వకూడదని ఆయన సూచించారు. ఎక్కడైనా పాలపిట్టలను పట్టుకుని బంధించినట్లు లేదా విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. అటవీ శాఖ టోల్‌ఫ్రీ నంబర్: 1800-425-5364, సమాచారం అందించేందుకు మరో నంబర్: 9803338666, అత్యవసర పోలీసు సహాయం: 112.
పాలపిట్టలను బోనుల్లో బంధించి చూడటం కంటే ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతుండగా వీక్షించడమే పక్షుల పట్ల నిజమైన గౌరవమని ఆయన సందేశమిచ్చారు. పండుగ ఆనందాన్ని ఇతర ప్రాణులకు హాని కలిగించకుండా జరుపుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


