అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ మిచిగన్ రాష్ట్రంలో రాజకీయ వివాదం తీవ్రమైంది. డెమోక్రటిక్ ప్రతినిధి హేలీ స్టీవెన్స్ తమ పార్టీ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్‌కు మద్దతు ఉపసంహరించుకుని, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయంపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మిచిగన్ రాష్ట్ర సెనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రతినిధి హేలీ స్టీవెన్స్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తమ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్‌కు మద్దతు ఉపసంహరించుకున్న ఆమె.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయంపై డెమోక్రటిక్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది.
మిచిగన్ సెనేట్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో హేలీ స్టీవెన్స్ పోటీ చేసి అబ్దుల్ ఎల్-సయీద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు మద్దతు ప్రకటించిన స్టీవెన్స్.. డెట్రాయిట్‌లోని ఓ చర్చిలో ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పరిణామం డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.
స్టీవెన్స్ స్పందన, ప్రకటన
తన నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో హేలీ స్టీవెన్స్ స్పందించారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా 800కు పైగా పదాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు తనను దూరం పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. తాను జీవితాంతం డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నానని, అయితే పార్టీ పట్ల విధేయత అంటే తన విలువలు, వ్యక్తిగత నిర్ణయాలను పక్కనపెట్టడం కాదని పేర్కొన్నారు. పార్టీలో విభేదాలను సహించలేకపోతే, దేశంలోని విభజనలను ఎలా తగ్గించగలమని ప్రశ్నించారు. ప్రజల ఆందోళనలను వినడానికి, భిన్నాభిప్రాయాలను గౌరవించడానికి పార్టీ సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
వివాదానికి దారితీసిన ప్రకటన
అబ్దుల్ ఎల్-సయీద్ ప్రచారానికి సంబంధించి ఓ బాహ్య సంస్థ విడుదల చేసిన ప్రకటన కూడా ఈ విభేదాలకు కారణమైంది. అమెరికా ఇజ్రాయెల్‌కు అందిస్తున్న మద్దతు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్న భావనను ఆ ప్రకటనలో ప్రస్తావించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. దీనిపై స్టీవెన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రకటనను ఎల్-సయీద్ ఖండించాలని ఆమె కోరగా, ప్రచార కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
పార్టీ నేతల విమర్శలు, రిపబ్లికన్ల స్వాగతం
స్టీవెన్స్ నిర్ణయంపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు నేతలు తీవ్రంగా స్పందించారు. సెనేట్‌లో డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ ఆమె చర్యను పార్టీకి ద్రోహంగా అభివర్ణించారు. మిచిగన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఆమెపై చర్యలు తీసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, రిపబ్లికన్ నేతలు మాత్రం స్టీవెన్స్ నిర్ణయాన్ని స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె నిర్ణయాన్ని ధైర్యవంతమైన చర్యగా ప్రశంసించారు.












