చెంగల్పట్టు
తమిళనాడులోని జిల్లా వల్లిపురం గ్రామంలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఐఐటీ మద్రాస్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని 350 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందారు. సురక్షిత నీటి సరఫరా, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం.
ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఆక్వామ్యాప్ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేయబడింది. సింగపూర్‌కు చెందిన లియన్ ఫౌండేషన్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ద్వారా నిధులను అందించింది. వల్లిపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు వికేంద్రీకృత తాగునీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
పాఠశాలల్లో అల్ట్రాఫిల్ట్రేషన్, అతినీలలోహిత కిరణాల ఆధారిత శుద్ధి పద్ధతులను ఉపయోగిస్తుండగా, ఆరోగ్య కేంద్రంలో రివర్స్ ఆస్మోసిస్, అతినీలలోహిత శుద్ధి సదుపాయాలు కల్పించారు. ఈ సదుపాయాలు వల్లిపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల మరో 14 గ్రామాలకు కూడా ఉపయోగపడుతున్నాయి.
నీటి నాణ్యత పర్యవేక్షణ
నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఐదు నీటి ట్యాంకులతో పాటు శుద్ధి వ్యవస్థల్లో అమర్చిన సెన్సార్ల ద్వారా నీటి ప్రవాహం, పీహెచ్ స్థాయి, మసకదనం, మొత్తం కరిగిన ఘన పదార్థాల స్థాయిని పర్యవేక్షిస్తున్నారు. ఈ వివరాలను అనుసంధానిత అప్లికేషన్ ద్వారా దూరం నుంచే పరిశీలించవచ్చు. క్రమం తప్పకుండా ప్రయోగశాల పరీక్షలు, సెన్సార్ల పనితీరును సరిచూడడం ద్వారా నీటి నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు.
వ్యర్థాల నిర్వహణ
గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు బ్యాటరీతో నడిచే చెత్త సేకరణ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పునర్వినియోగానికి పనికొచ్చే వ్యర్థాలను వేరు చేయడం, సేంద్రియ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడం వంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారు. ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను కాల్చకుండా ఉండడంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ప్రభావాన్ని అంచనా వేయగా, సర్వేలో పాల్గొన్న వారిలో 78.3 శాతం మంది ఇళ్లలో చెత్తను వేరు చేస్తున్నట్లు, 83.33 శాతం మంది జీవవిచ్ఛిన్నం కాని ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం లేదని తెలిపారు. పాఠశాల విద్యార్థులు రెండు రోజుల్లో సుమారు 300 కిలోల ప్లాస్టిక్ సహా జీవవిచ్ఛిన్నం కాని వ్యర్థాలను సేకరించారు.
గ్రామ పంచాయతీకి బాధ్యతలు
ఈ ప్రాజెక్టు ద్వారా వల్లిపురంలో సుమారు 2,000 మంది నివసించే గ్రామ సమాజానికి తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టును గ్రామ పంచాయతీకి అప్పగించిన నేపథ్యంలో, ఇకపై సదుపాయాల నిర్వహణ, నీటి నాణ్యత పరీక్షలు, ప్రజల భాగస్వామ్యాన్ని కొనసాగించడం వంటి బాధ్యతలు స్థానిక సంస్థపై ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి భద్రత, చెత్త నిర్వహణ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల భాగస్వామ్యం, స్థానిక సంస్థల సహకారంతో పరిష్కారాలు చూపవచ్చని ఈ కార్యక్రమం తెలియజేస్తోంది. ఇలాంటి నమూనాలను ఇతర గ్రామాల్లోనూ అమలు చేయడం ద్వారా పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను మెరుగుపరిచే అవకాశం ఉంది.












