ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జానకీపురం ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల ఎనిమిదో తరగతి విద్యార్థి అథర్వ్ సింగ్ తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. గుండె సంబంధిత సమస్య లేదా కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.
జానకీపురం ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల అథర్వ్ సింగ్, భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని తరగతి గదిలోకి ప్రవేశించిన వెంటనే వెనక్కి పడిపోయినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులు వెంటనే అతడిని సిబ్బంది గదికి తీసుకెళ్లి, తండ్రికి సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న తండ్రి, ఉపాధ్యాయుల సహాయంతో బాలుడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. గుండె సంబంధిత సమస్య లేదా కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించి ఉండవచ్చని వైద్యులు అనుమానించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్ అనుమానం వ్యక్తం చేయడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అథర్వ్ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ముజఫర్నగర్లో క్రీడా పోటీల్లో పాల్గొంటూ పదేళ్ల బాలుడు, ఢిల్లీలో తరగతి గదిలో తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి మరణించిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఈ సంఘటనలు తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తున్నాయి.











