కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై లంచం ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన కేరళలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో కాంట్రాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కాంట్రాక్టర్ సాజన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై లంచం ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆయన కేరళలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో కాంట్రాక్టర్ల నుంచి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు కేరళ హోంశాఖ, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోను ప్రాథమిక విచారణ చేపట్టాలని ఆదేశించింది. కాంట్రాక్టర్ సాజన్ ఇచ్చిన తాజా ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణ
2006లో కేరళలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం జ్ఞానేశ్ కుమార్ రూ.2 కోట్లు లంచంగా అడిగారని కాంట్రాక్టర్ సాజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మలేషియాకు చెందిన పాటి-బెల్ సంస్థ, కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కింద రహదారి అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో మలేషియా ఇంజినీర్ లీ సీ బీన్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.
పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.17 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంజినీర్లు ఆమోదించినప్పటికీ వాటి చెల్లింపులకు సంబంధించిన చెక్కులు విడుదల కాలేదని సాజన్ ఆరోపించారు. లంచం చెల్లించకపోవడంతోనే చెల్లింపులు నిలిపివేశారని లీ తనకు చెప్పినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. అయితే ఇవన్నీ ఫిర్యాదుదారుడు చేసిన ఆరోపణలు మాత్రమేనని గమనించాలి.
మలేషియా ఇంజినీర్ ఆత్మహత్యతో సంబంధం
ఈ వ్యవహారంలో కీలకంగా ప్రస్తావనకు వస్తున్న లీ సీ బీన్ 2010లో మలేషియాలో ఆత్మహత్య చేసుకున్నారు. కేరళలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడం, కాంట్రాక్టర్లు, సరఫరాదారుల నుంచి ఒత్తిడి పెరగడం వంటి అంశాలు ఆయనపై ప్రభావం చూపాయని ఆరోపణలు ఉన్నాయి.
లీ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్లో కేరళ ప్రజాపనుల శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అందులో అప్పటి కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అయితే, ఆ సూసైడ్ నోట్ బహిరంగంగా విడుదల కాలేదు.
గతంలోనూ విజిలెన్స్ విచారణ
ఈ ఆరోపణలపై 2006లోనే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. అయితే, ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ తదుపరి చర్యలు అవసరం లేదని అప్పట్లో నివేదిక ఇచ్చినట్లు కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల అసెంబ్లీలో వెల్లడించారు. 2012లో ఈ వ్యవహారానికి సంబంధించిన ఎనిమిది కేసులను తప్పుగా నమోదైనవిగా పేర్కొంటూ విజిలెన్స్ నివేదిక సమర్పించగా, కోర్టు వాటిని అంగీకరించినట్లు తెలిపారు.
అయితే, గత విచారణలో కీలకమైన వ్యక్తులను ప్రశ్నించలేదని, దర్యాప్తు మధ్యలోనే నిలిచిపోయిందని కాంగ్రెస్ నేత మలయింకీజ్ వేణుగోపాల్ గత నెలలో ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ పాత వ్యవహారంపై మరోసారి విచారణకు ఆదేశించింది. తాజాగా సాజన్ మరో ఫిర్యాదు చేయడంతో విచారణ పరిధి విస్తరించే అవకాశం ఏర్పడింది.


