హైదరాబాద్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నేపాల్‌కు చెందిన ముఠా సభ్యుల కోసం నెలల తరబడి గాలింపు చేపట్టిన పోలీసులు, మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో కేసులో ఇప్పటివరకు పోలీసులకు చిక్కిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.
ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ పోలీసులు ఒక ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసుల సమన్వయంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. బెంగళూరు, ముంబై, పుణె, సూరత్, పాట్నా, ఢిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. భారత్నేపాల్ సరిహద్దు సమీపంలోనూ బృందాలు మకాం వేసి సమాచారాన్ని సేకరించాయి.
ఇంతకుముందు పుణెలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారంలో 26 గ్రాములను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తాజా అరెస్టులతో కలిపి మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల సూచనలు
ఇళ్లలో పనివారు, వంటవారు, వాచ్మెన్లు, ఇతర సిబ్బందిని నియమించుకునే ముందు వారి గుర్తింపు, చిరునామా, గత ఉద్యోగ వివరాలను ధ్రువీకరించుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సూచించారు. అవసరమైన పోలీసు ధ్రువీకరణ చేయించుకోవాలని, ఇంట్లోని నగదు, బంగారం, విలువైన వస్తువుల వివరాలను అనవసరంగా ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.








