భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ తన భార్య భవానీ (30)ని హత్య చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి గోదావరి నదిలో పడేశాడు. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన నిందితుడు, అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఈ ఘటన ఈ నెల 3న జరిగినట్లు సమాచారం. భార్య కనిపించడం లేదని నరేందర్ తొలుత కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు భద్రాచలం గోదావరి వంతెన 22వ పిల్లర్ సమీపంలో గాలింపు చేపట్టారు. శుక్రవారం మండలం వేల్లేరు సమీపంలో గోదావరి నదిలో మృతదేహాన్ని గుర్తించి, వెలికితీశారు. మృతురాలు భవానీ (30)గా గుర్తించారు. దంపతులకు ఎనిమిది నెలల క్రితం పాప జన్మించగా, రెండు నెలలకే ఆ శిశువు మరణించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి తరచూ గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

