ఇసుక ర్యాంపుల కోసం అక్రమంగా రోడ్లు నిర్మిస్తూ, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న అటవీశాఖ అధికారుల తీరుపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి తీవ్రంగా మండిపడ్డారు. ఈ అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురిజాల గోపి సోమవారం మణుగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అడవిని దోచుకుంటూ, అక్రమాలకు పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు, ఇసుక ర్యాంపుల కోసం పచ్చని చెట్లను నరికి, భారీ రోడ్లు వేయడం ఏంటని ప్రశ్నించారు.
అమాయక గిరిజనులు అడవి నుండి చిన్న కర్రను తెచ్చుకుంటే నిబంధనలు గుర్తుచేసే అధికారులు, ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లు ఎలా నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రోడ్డు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి, పెద్ద వ్యాపారులతో కుమ్మక్కై రోడ్లు నిర్మించిన అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇసుక ర్యాంపుల కోసం వేసిన రోడ్డుకు 'జలపాతాలకు రహదారి' అని పేరు పెట్టడం మోసపూరితమని విమర్శించారు.
రోడ్డు నిర్మాణంపై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని, ఈ అక్రమాలపై ఆదివాసీ సంఘాలను ఏకం చేసి ఎఫ్.డి.ఓ. కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి దృష్టికి తీసుకెళ్లినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా నివేదిస్తామని గోపి తెలిపారు.









