ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ సరికొత్త క్రూయిజర్ బైక్‌ను ఆవిష్కరించింది. స్ప్రింట్ 440 పేరుతో రూపొందించిన ఈ మోటార్‌సైకిల్‌ను ఇటలీలో జరుగుతున్న ఈఐసీఎంఏ 2026 ప్రదర్శనలో పరిచయం చేశారు. హీరో మోటోకార్ప్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఈ బైక్, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎక్స్440 ఆధారంగా రూపొందింది.
క్రూయిజర్ శైలికి అనుగుణంగా ఇందులో పలు మార్పులు చేశారు. స్ప్రింట్ 440 రూపకల్పనకు 1961లో వచ్చిన హార్లీ డేవిడ్సన్ స్ప్రింట్ మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎక్స్440తో పోలిస్తే ముందు భాగాన్ని మరింత ఎత్తుగా కనిపించేలా 19 అంగుళాల ముందు చక్రాన్ని అమర్చారు. వెనుకవైపు 17 అంగుళాల చక్రం ఉంటుంది. కొత్త ఇంధన ట్యాంక్, హ్యాండిల్‌బార్, ఎగ్జాస్ట్ వ్యవస్థతో పాటు సీటు ఆకృతిలోనూ మార్పులు చేశారు.
తక్కువ ఎత్తులో సీటు
ఈ బైక్‌లో సీటు ఎత్తు 671 మిల్లీమీటర్లుగా ఉంది. ఎక్స్440లో ఇది 805 మిల్లీమీటర్లు. రైడర్ల అవసరాలకు అనుగుణంగా టాల్‌బాయ్, రీచ్ పేర్లతో అదనపు సీట్లను కూడా అందించే అవకాశం ఉంది. కొత్త రూపకల్పన కారణంగా బైక్ బరువు 187 కిలోలకు తగ్గింది. ఎక్స్440తో పోలిస్తే ఐదు కిలోలు తక్కువ.
ఇంజిన్, ఇతర వివరాలు
స్ప్రింట్ 440లో 440 సీసీ సింగిల్ సిలిండర్, గాలి-ఆయిల్ శీతలీకరణ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 6,000 ఆర్పీఎం వద్ద 27 హెచ్‌పీ గరిష్ఠ శక్తిని, 4,000 ఆర్పీఎం వద్ద 38 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు గేర్ల గేర్‌బాక్స్‌ను జత చేశారు. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది.
ముందు భాగంలో 320 మిల్లీమీటర్లు, వెనుక భాగంలో 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులు అమర్చారు. రెండు చక్రాలకు ఏబీఎస్ సదుపాయం ఉంది. 3.5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు లేవు.
ధర, విడుదల వివరాలు
బ్రిటన్‌లో ఈ బైక్ ప్రారంభ ధర 4,995 పౌండ్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6.35 లక్షలు. వివిడ్ బ్లాక్, టీల్ థండర్ రంగుల వేరియంట్లకు అదనంగా 200 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 2027 వసంతకాలంలో విక్రయాలు ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.
భారత్‌లో ఈ బైక్ విడుదలపై హార్లీ డేవిడ్సన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆటోమొబైల్ నివేదికలు పేర్కొంటున్నాయి.


