హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ () కీలక ముందడుగు వేసింది. 2026-2027 సంవత్సరాలకు సంబంధించిన సహకార కార్యాచరణ ప్రణాళికను ఈ కూటమి ఖరారు చేసింది. మాల్దీవుల్లో జరిగిన 8వ జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాల్దీవుల వేదికగా నవంబర్ 25న జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో భారత్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. మాల్దీవులు, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు ఆస్ట్రేలియా, మలేషియా అతిథి దేశాలుగా హాజరయ్యాయి. మారిషస్ వర్చువల్గా భాగస్వామ్యం వహించింది. ఈ దేశాలన్నీ కలిసికట్టుగా భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయి.
సముద్ర భద్రతను పటిష్టం చేయడం, ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలాన్ని అడ్డుకోవడం, అక్రమ రవాణా, అంతర్జాతీయ నేరాలు, సైబర్ భద్రత వంటి అంశాలపై దేశాలు ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించాయి. విపత్తుల సమయంలో మానవతా సహాయం అందించడంలోనూ సమన్వయం చేసుకోనున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి శిక్షణ, సమాచార మార్పిడి, సామర్థ్యాల పెంపునకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలన్నీ ఒకే సముద్ర జలాలను పంచుకుంటున్నాయని, ఈ జలాలు దేశాలను విభజించేవిగా కాకుండా కలిపేవిగా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు ఐక్యతతో కూడిన వారసత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
భారత్ తన నైబర్హుడ్ ఫస్ట్ విధానానికి, సాగర్ () దార్శనికతకు అనుగుణంగా సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని దోవల్ స్పష్టం చేశారు. ఈ సహకార ప్రణాళిక హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.


