భీమా డబ్బులు కాజేసేందుకు స్నేహితులు కలిసి ఒకరిపై హత్యాయత్నం చేసిన ఘటన బూర్గంపాడు మండలం మోతే వద్ద చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదంగా భావించిన కేసులో పోలీసుల దర్యాప్తులో హత్యాయత్నం జరిగినట్లు తేలింది. మోతే వద్ద తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న కట్టా యశ్వంత్ (23) పై అతని స్నేహితులే భీమా డబ్బుల కోసం దాడి చేసినట్లు ఎస్సై మేడ ప్రసాద్ తెలిపారు.
గన్నవరం గ్రామానికి చెందిన కట్టా సాయి, భద్రాచలం పట్టణానికి చెందిన భాను ప్రకాష్ లు, యశ్వంత్ పేరుతో భీమా పాలసీ తీసుకొని, అతన్ని హత్య చేయడానికి పథకం రచించారు. వీరిద్దరూ యాక్సిస్ బ్యాంకులో సేల్స్ సిబ్బందిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
యశ్వంత్ పై దాడి చేసి, రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, గాయాల తీరును బట్టి పోలీసులకు అనుమానం వచ్చి, లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.
విచారణలో భీమా డబ్బుల కోసమే ఈ హత్యాయత్నం జరిగినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఎస్సై మేడ ప్రసాద్ వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.








