భారత పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న జెట్వర్క్ సంస్థ, సుమారు రూ.5,012 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)తో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. అయితే, సంస్థ వ్యాపారం విస్తరిస్తున్నప్పటికీ, లాభాల మార్జిన్ తక్కువగా ఉండటం, కార్యకలాపాలకు నిరంతరం నగదు అవసరమవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.
భారత పారిశ్రామిక రంగంలో వేగంగా ఎదుగుతున్న తయారీ సంస్థల్లో జెట్వర్క్ ఒకటి. ఇతర కంపెనీలకు అవసరమైన పారిశ్రామిక పరికరాలు, విద్యుత్ ఉత్పత్తి పరికరాల భాగాలు, ఎలక్ట్రానిక్ విడిభాగాలను వివిధ కర్మాగారాల ద్వారా తయారు చేయించి సరఫరా చేసే వ్యాపార నమూనాతో ఈ సంస్థ విస్తరించింది. ఇప్పుడు సుమారు రూ.5,012 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)తో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది.
జెరోధా సంస్థకు చెందిన ది డైలీ బ్రీఫ్ న ప్రచురించిన విశ్లేషణ ప్రకారం, జెట్వర్క్ వ్యాపారం విస్తరిస్తున్నప్పటికీ, దాని లాభాల మార్జిన్ తక్కువగా ఉండటం, కార్యకలాపాలకు నిరంతరం నగదు అవసరమవడం ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.
జెట్వర్క్ వ్యాపార నమూనా ఏమిటి
ఒక కంపెనీకి విద్యుత్ ప్రసార పరికరాలు లేదా ప్రత్యేక పారిశ్రామిక యంత్ర భాగాలు అవసరమైతే, వాటిని తయారు చేయగల కర్మాగారాలను వెతకాలి. వాటి నాణ్యత, ధర, ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా సమయాలను పరిశీలించాలి. ఈ పనులన్నింటినీ జెట్వర్క్ తన బాధ్యతగా తీసుకుంటుంది.
కస్టమర్ ఇచ్చిన ఆర్డర్కు అనుగుణంగా తగిన కర్మాగారాన్ని ఎంపిక చేయడం, ముడిసరుకులు సమకూర్చడం, తయారీ ప్రక్రియను పర్యవేక్షించడం, నాణ్యతను తనిఖీ చేయడం, తుది ఉత్పత్తిని సమయానికి అందించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది. ఈ పనుల కోసం జెట్వర్క్ ఓఎస్ అనే సాఫ్ట్వేర్ వ్యవస్థను కూడా ఉపయోగిస్తుంది.
సంస్థకు భారత్, అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో 26 సొంత కర్మాగారాలు ఉండగా, బయటి సరఫరాదారుల నెట్వర్క్లో వేలాది సంస్థలు ఉన్నాయి. దీనివల్ల ఒక్కో కస్టమర్ అనేక తయారీ సంస్థలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.
విద్యుత్ పరికరాల తయారీ ప్రధాన ఆదాయ వనరు
జెట్వర్క్ తయారీ వ్యాపారంలో విద్యుత్ రంగానికి సంబంధించిన పరికరాలు, సౌర విద్యుత్ పరికరాలు, పవన విద్యుత్ టర్బైన్ భాగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, విమానయాన, రక్షణ రంగాలకు అవసరమైన ప్రత్యేక విడిభాగాలు, ఇతర పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు కూడా తయారు చేస్తుంది.
సిమెన్స్ గేమ్సా, ఏసర్ ఇండియా, సీజీ పవర్, ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎల్ అండ్ టీ ఎంహెచ్ఐ పవర్ బాయిలర్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం వంటి సంస్థలు దీని కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.
అయితే, జెట్వర్క్ ఆదాయం మొత్తం తయారీ నుంచే రావడం లేదు. పారిశ్రామిక ముడిసరుకులను కొనుగోలు చేసి తిరిగి విక్రయించే టెర్రా91 వ్యాపారం కూడా గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఉక్కు, అల్యూమినియం, రసాయనాల వంటి ముడిసరుకుల వ్యాపారంలో అమ్మకాల విలువ ఎక్కువగా కనిపించినా, వాటిపై వచ్చే లాభం మాత్రం తక్కువగా ఉండవచ్చు.











