క్వాల్కామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలో భాగంగా భారత్‌లోనూ లేఆఫ్స్ ప్రారంభించింది, సుమారు వెయ్యి ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్వాల్కామ్ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఉద్యోగుల కోతలో భాగంగా భారత్‌లోనూ లేఆఫ్స్ ప్రారంభించింది. బెంగళూరులోని తమ కార్యాలయంలో తొలి విడత తొలగింపులు చేపట్టినట్లు సమాచారం. ఈ ప్రభావం హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నైలోని క్వాల్కామ్ కార్యాలయాల్లోనూ ఉండే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఉద్యోగుల సర్వీసు కాలాన్ని బట్టి మూడు నెలల వేతనాన్ని పరిహారంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. తొలగింపు పత్రాలపై మూడు రోజుల్లో సంతకం చేసే వారికి అదనంగా మరో నెల జీతం కూడా ఇస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. భారత్‌లో సుమారు వెయ్యి ఉద్యోగాలు ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం టెక్నాలజీ రంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు గల కారణాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

