ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది.
ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపి, ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లా మండల పరిధిలోని రాజుపాలెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెనుక టైర్ వద్ద సమస్య తలెత్తి పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించాడు. బస్సును రోడ్డు పక్కన నిలిపి పరిశీలిస్తున్న సమయంలో టైర్ పేలి మంటలు కనిపించాయి.
వెంటనే డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు దించాడు. సుమారు 30 మంది ప్రయాణికులను వారి సామానుతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రయాణికులు బస్సు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి, వాహనం మొత్తం వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనాల ద్వారా వారి గమ్యస్థానాలకు తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

