దక్షిణాది చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా దేవా మృతికి సంతాపం తెలిపారు. దేవా అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం. తమిళ చిత్రసీమలో ఆయనను అభిమానులు ప్రేమగా తేనిసై తెంద్రల్ అని పిలిచేవారు. చెన్నై వీధుల్లో ప్రాచుర్యంలో ఉన్న గానా సంగీతాన్ని సినీ పాటల్లోకి తీసుకొచ్చి ప్రజాదరణ పొందేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
సంగీత ప్రస్థానం
దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. వేగవంతమైన బాణీలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడమే కాకుండా, మధురమైన ప్రేమగీతాలతోనూ సంగీతాభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
రజనీకాంత్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు
సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రాలకు దేవా అందించిన నేపథ్య సంగీతం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా అన్నామలై, బాషా చిత్రాల్లోని సంగీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రజనీకాంత్ తెరపై కనిపించే సమయంలో వినిపించే ప్రత్యేక నేపథ్య సంగీతంతో దేవా పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఆసై, కాదల్ కోట్టై, ఖుషి, వాలి, పంచతంత్రం వంటి చిత్రాలకు అందించిన సంగీతం కూడా విశేష ఆదరణ పొందింది. మాస్ పాటలు, మెలోడీలు, నేపథ్య సంగీతం.. ఇలా విభిన్న శైలుల్లో తన ప్రతిభను చాటుకున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ సంతాపం
దేవా మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. గానా పాటలతో సామాన్య ప్రజల హృదయాలను గెలుచుకున్న గొప్ప సంగీత దర్శకుడిని తమిళ చిత్ర పరిశ్రమ కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. దేవా సంగీత ప్రయాణం, ఆయన పాటలు చలనచిత్ర సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పించారు.
సామాన్యుల జీవితాలకు దగ్గరగా ఉండే గానా పాటల నుంచి మధురమైన ప్రేమగీతాల వరకు దేవా అందించిన సంగీతం అనేక తరాల ప్రేక్షకులను అలరించింది. ఆయన బాణీలు, గాత్రం, ప్రత్యేక సంగీత శైలి తమిళ సినీ సంగీతంపై చెరగని ముద్ర వేశాయి. దేవా భౌతికంగా దూరమైనా.. ఆయన స్వరపరిచిన పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటాయి.












