సేవల్లో, 24 జనవరి 2024
తీర్పు రాసే క్రమంలో అనుకోకుండా జరిగిన టైపింగ్ పొరపాట్లకు న్యాయాధికారులను తీవ్రంగా తప్పుబట్టడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు తుది ఫలితాన్ని ప్రభావితం చేయని పొరపాట్లకు న్యాయమూర్తులపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం అనవసరమని, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
రాజస్థాన్ న్యాయ సేవల్లో జిల్లా జడ్జి హోదాలో పనిచేస్తున్న ఓ మహిళా న్యాయాధికారి కేసులో సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. ఆమెపై రాజస్థాన్ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలుపై విచారణ చేపట్టింది. ఈ తీర్పు 2022లో వెలువడింది.
అసలు వివాదం ఏమిటంటే
రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో నమోదైన ఒకే ఎఫ్ఐఆర్కు సంబంధించి ఇద్దరు నిందితులపై వేర్వేరుగా విచారణలు జరిగాయి. వారిలో ఒకరు బాల నేరస్తుడు కాగా, మరొకరు వయోజనుడు. బాల న్యాయ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం బాల నేరస్తుడు, వయోజన నిందితుడిపై కలిపి విచారణ జరపడానికి వీలులేకపోవడంతో ప్రత్యేకంగా రెండు కేసులు నడిచాయి. ఈ రెండు కేసులకు సంబంధించిన తీర్పులను మహిళా న్యాయాధికారి 2022లో వెలువరించారు. ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
అయితే రెండు కేసుల్లో సాక్షులు, ఆధారాలు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఒక కేసు తీర్పులో మరో కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాల వివరాలు, సాక్షుల సంఖ్యలు పొరపాటున నమోదయ్యాయి. బాల నిందితుడి శిక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన రాజస్థాన్ హైకోర్టు.. మహిళా న్యాయాధికారి తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తీర్పును స్వయంగా రాయకుండా ఇతరులతో రాయించి సంతకం చేసినట్లు అనుమానం వ్యక్తం చేసింది. తీర్పులో కాపీ చేసి అతికించే విధానాన్ని అనుసరించారని వ్యాఖ్యానించింది.
హైకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు జోక్యం
తీర్పులు రాయడంలో శిక్షణ తీసుకోవాలని ఆదేశించడంతోపాటు, హైకోర్టు ఉత్తర్వులను ఆమె వార్షిక గోప్య నివేదికలో (ఏసీఆర్) పొందుపరచాలని సూచించింది. దీనిపై మహిళా న్యాయాధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు కేసుల్లో సాక్షులు, ఆధారాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని వివరించారు. ప్రత్యేక పోక్సో కోర్టులో సిబ్బంది కొరత ఉందని, ఏకైక స్టెనోగ్రాఫర్ సెలవులో ఉండటంతో కొంత తీర్పును దిగువ స్థాయి ఉద్యోగితో కంప్యూటర్లో టైప్ చేయించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని వివరాలు పొరపాటున నమోదయ్యాయని, అవి తీర్పు సారాంశాన్ని లేదా తుది ఫలితాన్ని ప్రభావితం చేయలేదని వివరించారు.
న్యాయాధికారులను గౌరవించాలి
వాదనలు పరిశీలించిన సుప్రీంకోర్టు.. అనుకోకుండా జరిగిన టైపింగ్ పొరపాట్లకు న్యాయాధికారిని తీవ్రంగా విమర్శించడం నివారించదగిన విషయమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం దిగువ కోర్టులపై హైకోర్టులకు పర్యవేక్షణ అధికారం ఉంటుందని గుర్తుచేసింది. అయితే ఆ అధికారాన్ని జిల్లా న్యాయవ్యవస్థను బలోపేతం చేసేలా, మార్గనిర్దేశం చేసేలా వినియోగించాలని సూచించింది. న్యాయాధికారులపై ప్రతికూల వ్యాఖ్యలు వారి వృత్తి జీవితాన్ని దెబ్బతీయడమే కాకుండా, దిగువ కోర్టుల్లో పనిచేసే ఇతర న్యాయమూర్తులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.


