పల్నాడు, 14 జనవరి 2019
భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన వివాహానికి, ఆ చట్టంలో గుర్తించని కారణంతో విదేశీ కోర్టు విడాకులు మంజూరు చేస్తే వాటిని భారత్‌లో స్వయంచాలకంగా చెల్లుబాటైనవిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎన్నారై వైద్యుడిపై నమోదైన బహుభార్యత్వం కేసు విచారణ కొనసాగాలని ఆదేశించింది. విదేశీ పౌరసత్వం పొందినప్పటికీ భారతీయ చట్టాల నుంచి తప్పించుకోలేరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన ఒక వైద్యుడికి హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి వివాహం జరిగింది. ఆ తర్వాత ఆయన ఉద్యోగం, వృత్తి నిమిత్తం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. కొంతకాలానికి ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య కుటుంబ వివాదం ప్రారంభమైంది. మొదట భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతపై కూడా వివాదం ఏర్పడింది. వైద్యుడు ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకులు, పిల్లల కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, తన అప్పీల్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. దీంతో భారతీయ చట్టాల ప్రకారం మొదటి వివాహం కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులో కీలక పరిణామం ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఆ వైద్యుడు సుమారు ఎనిమిదేళ్లపాటు అక్కడ నివసించి బ్రిటన్ పౌరసత్వం పొందారు. 2016లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. 2029లో వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదనే కారణంతో లండన్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 2014లో యూకేలోని నార్ఫోక్ ప్రాంతంలో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. అయితే భారతదేశంలో మొదటి వివాహం చట్టబద్ధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండో వివాహంపై వివాదం మొదలైంది.
భర్త రెండో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న మొదటి భార్య పల్నాడు జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో జరిగిన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాకుండానే భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో వైద్యుడు, ఆయన తల్లిదండ్రులు, రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఐపీసీ 494 (మొదటి వివాహం కొనసాగుతుండగా రెండో వివాహం చేసుకోవడం), ఐపీసీ 120బీ (నేరపూరిత కుట్ర), ఐపీసీ 34 (ఉమ్మడి ఉద్దేశంతో చేసిన నేరానికి బాధ్యత) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక న్యాయస్థానం ఈ కేసులో నిందితులపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
తమపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ వైద్యుడు, ఇతర నిందితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే 2008న హైకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలకమైన న్యాయపరమైన అంశాలను స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ప్రధానంగా ఈ విషయాలను పేర్కొంది. భారతదేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన వివాహానికి, ఆ చట్టంలో గుర్తించని కారణంతో విదేశీ కోర్టు విడాకులు మంజూరు చేస్తే వాటిని భారత్‌లో స్వయంచాలకంగా చెల్లుబాటైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వివాహ బంధం కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే కారణం హిందూ వివాహ చట్టంలో సాధారణ విడాకుల కారణంగా గుర్తించబడలేదని పేర్కొంది. అలాంటి కారణంతో విదేశీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పు భారతీయ చట్టాల ప్రకారం గుర్తింపు పొందాలంటే చట్టపరమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. బ్రిటన్ పౌరసత్వం పొందినంత మాత్రాన భారతదేశంలో జరిగిన మొదటి వివాహానికి సంబంధించిన చట్టపరమైన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. విదేశీ విడాకుల డిక్రీని రక్షణగా చూపించి క్రిమినల్ కేసును రద్దు చేయించుకోలేరని పేర్కొంది. వైద్యుడిపై పల్నాడు జిల్లాలో నమోదైన కేసు విచారణ కొనసాగాలని ఆదేశించింది.

