వ్యవసాయ, ఆహార పరిశ్రమల నుంచి వచ్చే సేంద్రియ వ్యర్థాలను అధిక ప్రోటీన్లు కలిగిన చేపల మేతగా మార్చే వినూత్న సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా చేపల పెంపకంలో మేత ఖర్చును 20-30 శాతం వరకు తగ్గించవచ్చని, ఉత్పత్తిని 15-20 శాతం పెంచవచ్చని అంచనా.
చేపల పెంపకంలో మేతపైనే అధిక వ్యయం అవుతుంది. నాణ్యమైన ప్రోటీన్ మేత ధర ఎక్కువగా ఉండటంతో రైతులకు ఉత్పత్తి వ్యయం భారంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐసీఏఆర్, వ్యవసాయ, ఆహార పరిశ్రమల వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో పోషక విలువలు కలిగిన చేపల మేతను తయారు చేసే విధానాన్ని రూపొందించింది.
ఈ సాంకేతికతలో వరి తవుడు, టపియోకా వ్యర్థాలు, నూనె గింజల పిండి, బీరు తయారీలో మిగిలే ధాన్యపు అవశేషాలు వంటి పదార్థాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు బ్లాక్ సోల్జర్ ఫ్లై () కీటకం లార్వాలు, పట్టుపురుగుల ప్యూపాలను ప్రోటీన్ వనరులుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలు సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తీసుకుని, వాటిని ప్రోటీన్, కొవ్వు పదార్థాలు సమృద్ధిగా ఉండే జీవపదార్థంగా మారుస్తాయి. అనంతరం వాటిని శుద్ధి చేసి చేపల మేత తయారీలో ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడంతో పాటు, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చు.
ఐసీఏఆర్ కు చెందిన సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఐఎఫ్ఆర్ఐ) ఈ విధానంపై 15 ఏళ్లకు పైగా పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనల ఆధారంగా చేపలకు అవసరమైన పోషకాలను అందించే సమతుల్య మేత తయారీ విధానాలను రూపొందించారు. రోహు, కట్లా, మృగాల్ వంటి ప్రధాన మంచినీటి చేపలతో పాటు తిలాపియా, పంగాసియస్, అలంకరణ చేపల పెంపకంలోనూ ఈ మేతను పరీక్షించారు.
క్షేత్రస్థాయి ప్రయోగాల ప్రకారం, ఈ సాంకేతికతతో చేపల మేత తయారీ ఖర్చు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. సంప్రదాయ మేతలో ఉపయోగించే చేపల పొడికి ప్రత్యామ్నాయంగా 75 నుంచి 100 శాతం వరకు ఇతర ప్రోటీన్ పదార్థాలను వినియోగించవచ్చని పరిశోధనల్లో గుర్తించారు. అంతేకాకుండా, చేపల ఉత్పత్తి 15 నుంచి 20 శాతం పెరిగినట్లు ప్రయోగాత్మక ఫలితాలు సూచించాయి. ఈ విధానం దేశంలోని చేపల పెంపకం రంగానికి ఏటా సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం అందించగలదని అంచనా.
సీఐఎఫ్ఆర్ఐ కేజ్ గ్రో ఫ్లోటింగ్ ఫీడ్, రెష్మీన్ మేత సిరీస్, బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాలతో తయారు చేసిన మేత, పట్టుపురుగుల ప్యూపా ఆధారిత మేత వంటి ఉత్పత్తులను రూపొందించింది. చిన్న స్థాయి వ్యాపారులు రోజుకు అర టన్ను మేత తయారు చేసే స్థాయి నుంచి పెద్ద సంస్థలు ఏడాదికి 50 వేల టన్నుల వరకు ఉత్పత్తి చేసేలా ఈ సాంకేతికతను విస్తరించవచ్చు. మేత నాణ్యత, భద్రత, పోషక విలువలు ఒకే విధంగా ఉండేలా తయారీ ప్రక్రియకు నిర్దిష్ట ప్రమాణాలను కూడా రూపొందించారు.
వ్యవసాయ, ఆహార పరిశ్రమల వ్యర్థాలను మళ్లీ వినియోగించడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చేపల రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన మేత అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మేత తయారీ యూనిట్ల ఏర్పాటుతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. ఈ విధానం అమలుతో చేపల పెంపకం ఖర్చులు తగ్గి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు, దేశంలో మత్స్య ఉత్పత్తి రంగం మరింత స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు దోహదపడనుంది.

