ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీణ్ 2.0 కింద రాష్ట్రానికి మంజూరైన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి జిల్లా బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ ఇళ్ల కోసం కేంద్రం తొలి విడతగా రూ.3,600 కోట్లు విడుదల చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపే మరో 3 లక్షల ఇళ్లకు అనుమతులు ఇస్తామని, ఆ తర్వాత మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. దీంతో దశలవారీగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి మొత్తం 9 లక్షల ఇళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది.
రాష్ట్రానికి తొలుత సుమారు 76 వేల ఇళ్ల కేటాయింపు మాత్రమే ఉండగా, పేద కుటుంబాలందరికీ పక్కా ఇళ్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఆ సంఖ్యను 3 లక్షలకు పెంచినట్లు చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించేందుకు కేంద్రం సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
3డీ కాంక్రీట్ ప్రింటింగ్తో ఇళ్ల నిర్మాణం
ఇదే కార్యక్రమంలో దేశంలో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం ప్రాంతాల్లో 177 ఇళ్లను రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ సాంకేతికతతో నిర్మాణ సమయం, కార్మిక అవసరం, నిర్మాణ వ్యర్థాలు తగ్గడంతో పాటు ఇళ్ల నాణ్యత, మన్నిక మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టును సుమారు ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుత 3 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న ఇతర గృహ నిర్మాణ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.

