ఓటు చోరీ, కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో పాదయాత్ర, ఈసీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఇండియా కూటమి ఎంపీలు సేవ్ డెమొక్రసీ పేరుతో చేపట్టిన పాదయాత్ర, ఈసీ కార్యాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. నిర్వాచన్ సదన్ వైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలపై కూడా ఆంక్షలు విధించారు. మరికొద్దిసేపట్లో మకర ద్వారం నుంచి నిర్వాచన్ సదన్ వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ చేపట్టనున్నారు.
4 వేల మంది బలగాలతో బందోబస్తు
ప్రతిపక్షాల ర్యాలీకి ముందస్తు అనుమతి ఏదీ ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సుమారు 4,000 మంది బలగాలను రంగంలోకి దింపారు. సున్నితమైన ప్రాంతాల్లో ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ దృష్ట్యా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఒక అడ్వైజరీని జారీ చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్, అశోకా రోడ్, జంతర్ మంతర్, విండ్సర్ ప్లేస్ తదితర పరిసర ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచే ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, వీలైతే మెట్రో సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.
ఉద్రిక్త వాతావరణం
ఒకవైపు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం, మరోవైపు ప్రతిపక్షాల పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

