హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన నిరాశజనకంగా కొనసాగుతోంది. పాకిస్థాన్, యూఏఈ లతో పాటు తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన బౌల్ సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీలో ఇది భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం.
శనివారం జరిగిన బౌల్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడిన భారత జట్టు మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాటర్ మార్టిన్ ఆండర్సన్ కేవలం 13 బంతుల్లోనే 51 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడ్ బర్నార్డ్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ వృథా
125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నితీశ్ రాణా మరోసారి బ్యాట్‌తో నిరాశపరిచాడు. అయితే రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడాడు. కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 56 పరుగులు సాధించాడు. శశాంక్ సింగ్ 9 బంతుల్లో 29 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు.
కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా ఏడు బంతుల్లో 28 పరుగులు చేసి పోరాడాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. కృనాల్ వరుసగా ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదడంతో చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి బంతికి ఒక్క పరుగు మాత్రమే రావడంతో భారత్ 121 పరుగులకే పరిమితమైంది. దీంతో మూడు పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
గత మ్యాచ్‌లలోనూ ఓటములు
ఈ టోర్నీలో భారత్ తన తొలి గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు ఓవర్లలో 88 పరుగులు చేసింది. శశాంక్ సింగ్ 11 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పాకిస్థాన్ 3.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు ఓవర్లలో 94 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూఏఈ బ్యాటర్లు చెలరేగారు. ఖలీద్ షా 14 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేయగా, అన్ష్ టాండన్ 12 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈ వికెట్ నష్టపోకుండా 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.
11వ స్థానం కోసం ప్లేఆఫ్
వరుసగా మూడు ఓటములతో హాంకాంగ్ సిక్సెస్‌లో భారత జట్టు ప్రధాన కప్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో 11-12 స్థానాల కోసం జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి టోర్నీని ముగించాలని భారత జట్టు భావిస్తోంది.

