మణుగూరు మండలంలోని కట్టుమల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల గిరిజనులకు పోడు భూమి పట్టాల విషయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పేద గిరిజనులకు పోడు భూమి పట్టాలు అందించి ఆదుకున్నారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం కొందరు వ్యక్తులు అమాయక గిరిజన కుటుంబాలలో పోడు భూముల పట్టాల పేరుతో గొడవలు సృష్టించి స్వార్థం కోసం చూస్తున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు.
ఎవరైనా అమాయకులైన పేద గిరిజనులకు సహాయం చేయాలనుకుంటే, పట్టాలు రాని గిరిజనులకు పట్టాలు ఇప్పించాలి తప్ప, వారికి ఉన్న భూముల విషయంలో తలదూర్చి గందరగోళం సృష్టించి వారి జీవితాలను అయోమయంలో పడేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
కట్టుమల్లారం పోడు భూమి సాగుదారులకు మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి వింత పోకడలు పోయే వారికి రానున్న రోజుల్లో కాలమే తగిన సమాధానం చెబుతుందని నాగేశ్వరరావు తెలిపారు.









