గజ్వేల్, జూన్ 30
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అయ్యప్ప నగర్ కాలనీలో రోడ్ల మరమ్మతులు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించారు. అమృత్ సంస్థ వారు పైపులైన్ పనుల కోసం తవ్వేసిన రోడ్లను సరిచేయాలని వారు కోరుతున్నారు. కాలనీలో రహదారుల విషయంలో వివక్ష చూపుతున్నారని వాపోయారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అయ్యప్ప నగర్ కాలనీలో గల రాజీవ్ పార్క్ రోడ్డు నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రోడ్డును అమృత్ సంస్థ వారు పైపులైన్ పనుల నిమిత్తం తవ్వేసి, మరమ్మతుల అనంతరం అలానే వదిలేశారని, ఆ రోడ్డును ప్రయాణికులకు సౌకర్యంగా యధావిధిగా మరమ్మతులు చేపట్టాలని అయ్యప్ప నగర్ కాలనీవాసులు స్థానిక మున్సిపల్ కమిషనర్, చైర్మన్లకు వినతి పత్రం అందించారు.
అనంతరం కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, ప్రధాన కార్యదర్శి మోతె వీరారెడ్డి సభ్యులతో కలిసి మాట్లాడుతూ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి అయ్యప్ప నగర్ కాలనీలోని రహదారులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. గతంలో చాలాసార్లు కాలనీ రోడ్ల మరమ్మతులు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.
గతంలో మున్సిపాలిటీలో ప్రజలు నివాసం లేని ఓపెన్ ప్లాట్ల వద్ద, అవసరం లేని రోడ్లలో సీసీ రోడ్లు వేశారని, నిత్యం ప్రజలు ప్రయాణించే అయ్యప్ప నగర్ కాలనీ ప్రధాన రోడ్లను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ప్రధాన కాలనీ అయిన అయ్యప్ప నగర్ రోడ్లను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాలనీవాసుల విజ్ఞప్తిపై మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బండ్ల స్వామి, ప్రధాన కార్యదర్శి మోతే వీరారెడ్డి, కోశాధికారి అలివేలు నారాయణరెడ్డి, కాలనీ సభ్యులు వగ్గు మల్లేశం, ఎంకన్నగారి గోపాల్ రెడ్డి, గురప్పగారి శ్రీరాములు, రేకుల కృష్ణారెడ్డి, బుస్స పండరి, కొట్టాల యాదగిరి, రంగు శ్రీనివాస్, కోల సూర్యారావు, కాశిరెడ్డి బాల్ రెడ్డి, నాగరాజు, గుజ్జేటి కిరణ్, మారుపల్లి సంజయ్, కాశిరెడ్డి సాయిచరణ్ రెడ్డి పాల్గొన్నారు.









