మానుగూరు, 20 July
మణుగూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పైప్లైన్ పనుల వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయని, నెల రోజులుగా కూరగాయల మార్కెట్ వద్ద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పైప్లైన్ పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. పనులు చేపట్టడంలో చూపుతున్న హడావుడి, వాటిని పూర్తి చేయడంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
ప్రధాన రహదారిపై ఉన్న కూరగాయల మార్కెట్ ప్రాంతంలో దుకాణాలకు ఎదురుగా పైప్లైన్ వేసి దాదాపు నెల రోజులు గడిచినా, తవ్విన గోతులను పూడ్చకుండా అలాగే వదిలేయడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజూ వందలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో గోతులు ఉండటంతో ప్రమాదాల భయం నెలకొంది. దుకాణాలకు వచ్చే వినియోగదారులు ఇబ్బందులు పడుతుండటంతో వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం కురిసిన సమయంలో గోతుల్లో నీరు నిల్వ ఉండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వారు చెబుతున్నారు. అధికారులు పనులు ప్రారంభించే ముందు ప్రణాళికతో వ్యవహరించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రజల సౌకర్యాల కోసం చేపట్టే అభివృద్ధి పనులు ప్రజలకే భారంగా మారడం విచారకరమని స్థానికులు అంటున్నారు. ప్రజా ధనంతో చేపట్టిన పనులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారకుండా అధికారులు వెంటనే స్పందించి తవ్విన గోతులను పూడ్చి రహదారిని యథావిధిగా అందుబాటులోకి తీసుకురావాలని వ్యాపారులు, స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.









