భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనబోతులగూడెం–వేమలూరు గ్రామాల్లో పోడు భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూముల్లో పత్తి విత్తనాలు వేస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మహిళలతో తోపులాట చోటుచేసుకుంది. మహిళలు నేలపై పడిపోయిన దృశ్యాలు, వారిని బలవంతంగా అడ్డుకున్నట్లు కనిపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీశాయి.
గిరిజనుల ఆరోపణల ప్రకారం, తమ జీవనాధారమైన పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు మహిళలతో అమర్యాదగా ప్రవర్తించి, బలప్రయోగానికి దిగారని తెలిపారు. మహిళలపై జరిగిన ఈ ఘటన గిరిజన సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మణుగూరు రేణుక అక్షర మహిళా మండలి, మహిళలపై దురుసుగా ప్రవర్తించిన అటవీ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ఐటిడిఎ పీవో దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారిక ఫిర్యాదు లేఖ సమర్పించనున్నట్లు మండలి నాయకులు తెలిపారు. గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యలను సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
"బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనను ఉద్ధృతం చేస్తాం. గిరిజన మహిళలపై చేయి వేసిన వారిని వదిలిపెట్టేది లేదు" అని రేణుక అక్షర మహిళా మండలి స్పష్టం చేసింది.
అంతేకాకుండా, గిరిజన మహిళల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ప్రతి గిరిజన మహిళ ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని రేణుక అక్షర మహిళా మండలి పిలుపునిచ్చింది. గిరిజన మహిళలపై ఎలాంటి దాడి జరిగినా సహించేది లేదని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ, సభ్యులు ఎండి షబానా, కోరి శ్యామల, కన్నాపురం వసంత, రెడ్డిబోయిన రేణుక, డేరంగుల సుజాత, కన్నాపురం శైలజ, బాడిష పార్వతి, తదితరులు పాల్గొన్నారు.









