హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏడు రాష్ట్రాలకు చెందిన 55 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ చర్యల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితులకు దాదాపు రూ.50 లక్షలు తిరిగి ఇప్పించగలిగారు. మొత్తం 38 సైబర్ నేరాల కేసుల్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టయిన 55 మందిలో అత్యధికంగా 20 మంది ట్రేడింగ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన వారిలో ఓటీపీ మోసాలు 10 మంది, సోషల్ మీడియా నేరాలు 7 మంది, పెట్టుబడి మోసాలు 4 మంది, వ్యాపార మోసాలు 4 మంది, డిజిటల్ అరెస్ట్ మోసాలు 3 మంది, నకిలీ ఫైళ్ల మోసాలు 3 మంది, ఇతర నేరాలు 4 మంది ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
ఈ నిందితుల నుంచి 37 మొబైల్ ఫోన్లు, 10 డెబిట్/క్రెడిట్ కార్డులు, 8 చెక్‌బుక్‌లు, 6 బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఏడు రాష్ట్రాల్లో అరెస్టులు
పోలీసుల వివరాల ప్రకారం అరెస్టయిన వారిలో తెలంగాణ, మహారాష్ట్ర నుంచి 16 మంది చొప్పున ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, గుజరాత్ నుంచి 7 మంది, ఢిల్లీ నుంచి 5 మంది, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
అక్టోబర్‌లో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 129 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
నష్టపోయిన మొత్తం, తిరిగి వచ్చినది
పోలీసులు వెల్లడించిన రీఫండ్ వివరాల ప్రకారం 56 కేసుల్లో బాధితులు మొత్తం రూ.25.46 కోట్లను కోల్పోయారు. ఇందులో రూ.49.99 లక్షలను గుర్తించి బాధితులకు తిరిగి అందించారు. ట్రేడింగ్ మోసాల బాధితులకు రూ.34.20 లక్షలు, డిజిటల్ అరెస్ట్ బాధితులకు రూ.9.54 లక్షలు, పెట్టుబడి మోసాల బాధితులకు రూ.5.13 లక్షలు అందాయి.
అదనంగా, జోనల్ సైబర్ సెల్స్ అక్టోబర్‌లో 2,649 ఫిర్యాదులు స్వీకరించి 393 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. 14 కేసుల్లో 18 మందిని అరెస్ట్ చేసి బాధితులకు రూ.25.96 లక్షలు తిరిగి ఇప్పించాయి.
హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, మరో వ్యక్తి కలిసి హనీట్రాప్‌లో చిక్కించి రూ.38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే పెట్టుబడి ఆఫర్లు, నకిలీ ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్స్, అనుమానాస్పద ఫైళ్లు, వాట్సాప్ సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకున్న వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏడు రాష్ట్రాలకు చెందిన 55 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ చర్యల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితులకు దాదాపు రూ.50 లక్షలు తిరిగి ఇప్పించారు. మొత్తం 38 సైబర్ నేరాల కేసుల్లో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

