జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్రాతోర్పా ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
జోనేలుద్రు మలుపు సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోవడంతో స్థానికులు అతడిని బయటకు తీసేందుకు గుమిగూడారు. ఈ క్రమంలో తోర్పా వైపు నుంచి వేగంగా వచ్చిన 18 చక్రాల భారీ లారీ, మలుపు వద్ద అదుపుతప్పి అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిలో మహిళలు, చిన్నారులు ఉండటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై జిల్లా ఎస్పీ రిషభ్ గార్గ్ స్పందించారు. చీకటి కారణంగా లారీ డ్రైవర్ రోడ్డుపై గుమిగూడిన జనాన్ని గుర్తించలేకపోయి ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.












