ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళలోని కొచ్చిలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించనుంది. జంతర్ మంతర్ ఎట్ కొచ్చి పేరుతో రాజేంద్ర మైదాన్‌లో ఈ నిరసన జరగనుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నటుడు ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళలోని కొచ్చిలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. జంతర్ మంతర్ ఎట్ కొచ్చి పేరుతో రాజేంద్ర మైదాన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు దక్షిణ భారత విభాగం నాయకుడు విజయ్ మల్లంగి, జాతీయ కార్యదర్శి ఆఫ్రీన్ నవాజ్ పాల్గొననున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ నిరసనలో పాల్గొననున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఎస్ఐఆర్ను రద్దు చేయండి అనే నినాదంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనివల్ల ఓటర్ల హక్కులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
గత నెల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన సందర్భంగా అభిజీత్ దీప్కేతో పాటు పార్టీ నాయకులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.

