స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన ఓ ఫార్మా కంపెనీ నిర్వాహకుడిని మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.26.02 కోట్ల సైబర్ పెట్టుబడి మోసం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఫార్మా కంపెనీ నిర్వాహకుడు నిమేశ్ (49)కు 2023లో టెలిగ్రామ్, సోషల్ మీడియా ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించిన సందేశాలు వచ్చాయి. ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని కొందరు నమ్మించారు. ఇందుకోసం క్యాపిటలిక్స్ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వారి మాటలు నమ్మిన నిమేశ్ 2023 నుంచి 2029 వరకు విడతలవారీగా రూ.26.02 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అయితే హామీ ఇచ్చిన విధంగా పెట్టుబడి సొమ్ము, లాభాలను తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు 2023లో ఎర్నాకుళం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మనీలాండరింగ్ కోణంలో కొచ్చికి చెందిన ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆశ్రిత మెగా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల లావాదేవీలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కంపెనీల వ్యవస్థాపకుడు అల్లంరాజు సత్యనారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేర్లతో పలు సంస్థలు ఏర్పాటు చేసి వాటి ద్వారా డబ్బును మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని సత్యనారాయణమూర్తి నివాసంతో పాటు కుత్బుల్లాపూర్, శంషాబాద్‌లోని శాతంరాయి సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.6.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.14 లక్షల నిల్వలు ఉన్న 11 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లాలతో కూడిన స్థిరాస్తులను గుర్తించారు. డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బును హైదరాబాద్‌లో స్థిరాస్తుల కొనుగోలుకు, విల్లాల నిర్మాణానికి మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రూ.26 కోట్లకు పైగా జరిగినట్లు ఆరోపణలున్న ఈ సైబర్ పెట్టుబడి మోసం వ్యవహారంలో మరిన్ని వివరాలను సేకరించేందుకు ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయింది ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై విచారణ జరుగుతోంది.












