Charla, 2026-11-23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూజారిగూడెం శివార్లలో సోమవారం 70వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు. యువత క్రీడల్లో ప్రతిభ కనబరిచేందుకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ () నిధుల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.75 లక్షల వ్యయంతో పూజారిగూడెం శివార్లలో క్రీడా మైదానాన్ని నిర్మించినట్లు తెలిపారు. స్థానిక ప్రజలు, కాంట్రాక్టర్ల సహకారంతో మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. మైదానం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా నిలవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ మైదానం స్థానిక యువతకు క్రీడా సాధనతో పాటు, పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షల ప్రాక్టీస్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత యువత విద్య, క్రీడలు, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పోలీస్ శాఖ తన వంతు కృషి కొనసాగిస్తుందని తెలిపారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, క్రీడా నిర్వాహకులు, కోచ్‌లు, వివిధ జిల్లాల క్రీడాకారులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



