మారిలిన్ హాంప్టన్ 1983లో ఆబ్రే స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ఉద్యోగంలో చేరారు.
మారిలిన్ హాంప్టన్ 1983లో ఆబ్రే స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ఉద్యోగంలో చేరారు. తొలుత లైబ్రరీలో పనిచేయాలని భావించినా, పాఠశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాఠశాలలను శుభ్రంగా ఉంచడమే కాకుండా, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, నోట్‌బుక్స్ వంటివి సొంత డబ్బులతో కొనిచ్చేవారు. చదువులో వెనుకబడిన పిల్లలకు సహాయం చేయడం, పరీక్షలకు సిద్ధం చేయడం, అవసరమైన వారికి భోజన డబ్బులు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేవారు. పాఠశాల ఫుట్‌బాల్ మ్యాచ్‌ల సమయంలో టికెట్ కౌంటర్లలోనూ పనిచేసేవారు.
ఎనిమిది మంది సంతానమున్న కుటుంబంలో పెరిగిన మారిలిన్, తన తోబుట్టువులందరిలో హైస్కూల్ విద్య పూర్తి చేసిన ఏకైక వ్యక్తి. కాలేజీ చదువు చదవలేకపోయాననే బాధ ఆమెకు ఉండేది. అయితే, పాఠశాలలో పనిచేస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం ఉందని ఆమె గుర్తించారు.
2022లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ, పిల్లలతో ఆమె అనుబంధం కొనసాగుతోంది. ప్రస్తుతం అదే స్కూల్ డిస్ట్రిక్ట్‌కు చెందిన ఎర్లీ బర్డ్ లెర్నింగ్ సెంటర్లో చిన్నారులతో సమయం గడుపుతున్నారు.
ఇటీవల నిర్వహించిన స్కూల్ బోర్డు సమావేశానికి మారిలిన్ను అధికారులు ఆహ్వానించారు. సాధారణ కార్యక్రమంలో భాగంగా ఎర్రటి కార్పెట్‌ను విప్పాలని ఆమెకు సూచించారు. అయితే, దానిపై మారిలిన్ హాంప్టన్ ఎలిమెంటరీ స్కూల్ అనే పేరు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన పేరుతో పాఠశాలకు పేరు పెట్టినట్లు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, బోర్డు సభ్యులు ఆమెను అభినందించారు.
పాఠశాల సూపరింటెండెంట్ షానన్ సేలర్ మాట్లాడుతూ, అధికారికంగా ఉపాధ్యాయురాలు కాకపోయినా, మారిలిన్ నిజమైన విద్యావేత్తలా విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆమె చూపిన దయ, సేవాభావం, అంకితభావం ఎంతోమందికి ఆదర్శమని పేర్కొన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విద్యార్థులకు సేవలందించిన మహిళకు పాఠశాల పేరును అంకితం చేయడం ద్వారా ఆమె సేవలను భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునే అవకాశం కల్పించారు.





