సిద్దిపేట, 29.07.2026
ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 96వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలంలో సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాకవికి ఘనంగా నివాళులర్పించారు.
సాహిత్య రంగంలో డా. సి. నారాయణ రెడ్డి సేవలు చిరస్మరణీయం అని, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సీ. నా రే 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి మహాకవికి నివాళులు అర్పించినట్లు సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయశంకర్ తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలం కేంద్రంగా నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ సి. నారాయణ రెడ్డి 96వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.తన కలంతో తెలుగు భాషకు అపూర్వమైన వైభవాన్ని చేకూర్చిన సినారె గారు కవిత్వానికి కొత్త దిశను చూపారని, సాహిత్యం, గేయం, గజల్, సినీగీతం, పరిశోధన, ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసి తెలుగు జాతి గర్వించే మహనీయుడిగా నిలిచారని కొనియాడారు.
సినారె రచనలు మానవీయ విలువలు, ప్రేమ, ప్రకృతి, సామాజిక చైతన్యం, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని, తెలంగాణ నేల గర్వించే మహనీయుడిగా, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ శిఖరంగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు మంద మల్లేశం, సామాజిక కార్యకర్త రాచూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.









