గణిత ప్రపంచంలో తన అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారతీయ గణిత మేధావి శకుంతలా దేవి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. ఆమె ప్రతిభను, గణిత రంగానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
ప్రతిభకు హద్దులు ఉండవని, పట్టుదల ఉంటే మానవ సామర్థ్యం ప్రపంచం ఊహించిన పరిమితులను కూడా అధిగమించగలదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మానవ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి గణితంలో చూపిన అసాధారణ నైపుణ్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
201 అంకెల సంఖ్యకు 23వ మూలాన్ని కేవలం 50 సెకన్లలో మానసికంగా లెక్కించడం, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన రెండు 13 అంకెల సంఖ్యలను కేవలం 28 సెకన్లలో గుణించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారని గుర్తుచేశారు.
కేవలం గణితంలో రికార్డులు సృష్టించడమే కాకుండా, గణితంపై యువతలో ఆసక్తిని పెంచేందుకు ఆమె విశేషంగా కృషి చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పుస్తకాలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా గణితాన్ని ఆసక్తికరంగా మార్చి, యువత తమ ఆలోచనా పరిధిని విస్తరించుకునేలా ప్రోత్సహించారని వివరించారు.
మానవ మేధస్సు సాధించగల సామర్థ్యంపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని శకుంతలా దేవి మార్చారని అన్నారు. ఆమె అసాధారణ ప్రతిభ భారతదేశానికి గర్వకారణమని, భయపడకుండా కలలు కనాలని, భిన్నంగా ఆలోచించాలని, లక్ష్య సాధన కోసం కృషి చేయాలని భవిష్యత్ తరాలకు ఆమె జీవితం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.












