రాజాం పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి విజయభేరి మోగించాలని నాయకులు సూచించారు.
రాజాం సమన్వయకర్త శ్రీ తలె రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. రాజాం ంలోని నాయకులు, కార్యకర్తలు పదవులను కాకుండా పార్టీ విలువలు, సిద్ధాంతాలను చూస్తారని అన్నారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఎప్పటికీ పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ చేయడం ద్వారా ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఉంటుందని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తగిన గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు పనులు చేయించుకోవడానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేసిన తర్వాత తమ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవాలని, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న స్థానిక ఎన్నికలలో విజయభేరి మోగిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
బొత్స 2.0 పై యువ నాయకుల వ్యాఖ్యలు
యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ లు మాట్లాడుతూ.. చంద్రబాబు పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా మారిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. తమ తండ్రి, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని, రానున్న రోజుల్లో కూడా అదే విధంగా ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో బొత్స 2.0ను చూస్తారని వారు పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలను వివరించాలని నాయకులు సూచించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పాలవలస విక్రాంత్, శ్రీ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, పరిశీలకులు శ్రీ కిల్లి సత్యనారాయణ, శ్రీ కేవీ సూర్యనారాయణ రాజు, జగన్మోహన్, రాజాం మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










