అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నానికి ప్రతినిధుల సభలో అడ్డుకట్ట పడింది. ఇరాన్‌తో యుద్ధం, ఇతర దేశాల్లో అమెరికా చేపట్టిన సైనిక చర్యల విషయంలో హెగ్సెత్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రిపబ్లికన్ ఎంపీ థామస్ మాసీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో మొత్తం ఎనిమిది ఆరోపణలు ఉన్నాయి.
ఇరాన్‌పై కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టడం, యెమెన్‌లో సైనిక కార్యకలాపాలు, లాటిన్ అమెరికా ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయనే అనుమానంతో పడవలపై దాడులు చేయడం, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునే చర్యలు, సైనిక చర్యల్లో పౌరుల ప్రాణరక్షణకు సంబంధించిన నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి అంశాలను అందులో ప్రస్తావించారు.
అమెరికా ప్రతినిధుల సభలో ఈ తీర్మానాన్ని న్యాయవ్యవహారాల కమిటీకి పంపించే తీర్మానంపై ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 211 మంది, వ్యతిరేకంగా 204 మంది ఓటు వేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన థామస్ మాసీ మాత్రమే తన పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యతిరేకంగా ఓటు వేయగా, డెమొక్రాట్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో హెగ్సెత్‌పై అభిశంసన ప్రక్రియ ముందుకు వెళ్లకుండా నిలిచిపోయింది.
ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడిన హెగ్సెత్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అభిశంసన ప్రయత్నాన్ని రాజకీయ నాటకంగా అభివర్ణించారు. సైనిక చర్యలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని, ఇవి నేరాలకు సంబంధించిన ఆరోపణలు కాకుండా విధానపరమైన విభేదాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హెగ్సెత్కు మద్దతుగా నిలిచారు. అభిశంసన ప్రయత్నం విఫలమైందని సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు.
మరోవైపు, డెమొక్రాటిక్ పార్టీ నేత హకీమ్ జెఫ్రీస్, హెగ్సెత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని విమర్శించారు. వచ్చే ఏడాది జనవరిలో కాంగ్రెస్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం లభించిన తర్వాత ఈ అంశాన్ని మళ్లీ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.





