ముంబై వడాలాలో భక్తి పార్క్ సిగ్నల్ వద్ద రెండు బస్సులు, రెండు కార్లు ఢీకొన్నాయి; ఐదుగురు, ఓ కుక్క గాయపడ్డారు.
వడాలా ప్రాంతంలోని భక్తి పార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం రాత్రి రెండు బస్సులు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బెస్ట్ () బస్సు వెనుక రెండు కార్లు నిలిచాయి. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ చలో బస్సు చివరగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు ముందుకు దూసుకెళ్లి బెస్ట్ బస్సును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ కారు బస్సు వెనుక భాగం కింద ఇరుక్కుపోయింది. కార్లలో ప్రయాణిస్తున్న వారు వాహనాల శిథిలాల్లో చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో వాహనాలను తొలగించి బాధితులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులతో పాటు ఓ పెంపుడు కుక్క కూడా గాయపడ్డాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సియాన్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సు డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై కూడా విచారణ కొనసాగుతోంది.





