తెలంగాణలో రైతు భరోసా పథకం పేరుతో నకిలీ సందేశాలు రైతుల మధ్య కలకలం సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరుతో ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయం అందినట్లుగా సుమారు 2.73 లక్షల మంది రైతులకు ఎస్ఎంఎస్లు వచ్చాయి.
అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ సందేశాలను తాము పంపలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి తెలిపారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. రైతులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందలేదని, వచ్చిన సందేశాలు పూర్తిగా అవాస్తవమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఎవరికీ వెల్లడించవద్దని రైతులకు అధికారులు సూచించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.












