మంచిర్యాలలో అటవీ సంరక్షణ, గిరిజనుల జీవనోపాధి, మానవవన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించే అంశాలపై రెండు రోజుల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అటవీ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సదస్సు ముగింపు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అడవులు, వన్యప్రాణులను సమర్థంగా సంరక్షించాలంటే వాటిపై ఆధారపడే వర్గాలకు మెరుగైన ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అటవీ ఉత్పత్తులకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజనులకు మరిన్ని ఆదాయ మార్గాలను కల్పించాలని అధికారులు సూచించారు. చిన్న అటవీ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్కు అందించడం ద్వారా గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశాలపై సదస్సులో చర్చ జరిగింది.
కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్తో పాటు పలువురు అటవీ అధికారులు అడవులు, వన్యప్రాణుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వేట, అటవీ ఆక్రమణలు, టేకు చెట్ల అక్రమ నరికివేతను అడ్డుకోవడంతో పాటు అటవీ ఉత్పత్తుల ఆధారంగా గిరిజనులకు ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలపై వివరించారు.
అటవీ సంరక్షణలో గిరిజనులను భాగస్వాములను చేయడం, మానవవన్యప్రాణుల ఘర్షణలను తగ్గించడం, స్థిరమైన అభివృద్ధి విధానాలను అమలు చేయడం వంటి అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయంతో ఉపయోగించుకుని ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.












