భారత నౌకాదళం తన సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జలాంతర్గాములను గుర్తించి, వాటి నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందించిన ఐఎన్ఎస్ మంగ్రోల్ యుద్ధనౌకను న నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌక తీర ప్రాంతాలు, తక్కువ లోతు ఉన్న సముద్ర జలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.
ముంబైలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ నౌకాదళ కమాండ్ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ అధ్యక్షత వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాముల కదలికలను గుర్తించడం, వాటిని పర్యవేక్షించడం, అవసరమైనప్పుడు ఎదుర్కోవడం ఐఎన్ఎస్ మంగ్రోల్ ప్రధాన విధి. పెద్ద యుద్ధనౌకలు సులభంగా పనిచేయలేని తక్కువ లోతు ప్రాంతాల్లోనూ ఈ నౌక సమర్థంగా పనిచేయగలదు.
జలాంతర్గాముల వేటలో కీలక పాత్ర
నౌకాశ్రయాలు, సముద్ర మార్గాలు, తీర ప్రాంతాల భద్రతకు ఈ నౌక ఉపయోగపడనుంది. ఇందులో జలాంతర్గాముల కదలికలను గుర్తించే అభయ్ హల్-మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ ప్రయోగ వ్యవస్థ, మారీచ్ టార్పెడో మోసపూరిత లక్ష్య వ్యవస్థ కూడా ఉన్నాయి.
వీటి ద్వారా నీటి అడుగున వచ్చే ముప్పులను గుర్తించి తగిన చర్యలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌకలో 80 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. మూడు డీజిల్ ఇంజిన్లు, వాటర్‌జెట్ చోదక వ్యవస్థతో రూపొందించిన ఈ నౌక తక్కువ లోతు ఉన్న జలాల్లో వేగంగా దిశ మార్చుకుంటూ పనిచేయగలదు.
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
జలాంతర్గాముల వ్యతిరేక కార్యకలాపాలతో పాటు సముద్ర గస్తీ, నీటి అడుగున నిఘా, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా చర్యలు, గనుల యుద్ధానికి సంబంధించిన విధుల్లోనూ ఇది సహాయపడనుంది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాకు చెందిన మంగ్రోల్ అనే తీర పట్టణం పేరు మీద ఈ నౌకకు నామకరణం చేశారు.
గతంలో ఇదే పేరుతో సేవలందించిన ఐఎన్ఎస్ మంగ్రోల్ (ఎం85) నౌకాదళంలో గనులను గుర్తించే నౌకగా పనిచేసి 2007లో సేవల నుంచి వైదొలిగింది. పాత యుద్ధనౌకల వారసత్వాన్ని కొనసాగించే సంప్రదాయంలో భాగంగా కొత్త నౌకకు అదే పేరు పెట్టారు. సముద్ర జలాల్లో జలాంతర్గాముల ముప్పులను ఎదుర్కోవడంలో ఐఎన్ఎస్ మంగ్రోల్ కీలకంగా మారనుంది.
తీర భద్రతకు మరింత బలం
సముద్ర గస్తీ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర యుద్ధనౌకలతో సమన్వయంగా పనిచేస్తూ నౌకాశ్రయాలు, తీర ప్రాంతాల రక్షణకు తోడ్పడుతుంది. స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో భారత్ సాధిస్తున్న పురోగతికి ఈ నౌక మరో ఉదాహరణగా నిలుస్తోంది.








