ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని వసుంధర పోలీస్ ఔట్ పోస్ట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఘజియాబాద్‌లోని వసుంధర పోలీస్ ఔట్ పోస్ట్‌లో నవంబర్ 6వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ జె. రవీందర్ గౌడ్ స్పందిస్తూ.. పేలుడుకు గల కారణం ఇంకా తెలియలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలంలో బాంబు నిర్వీర్య బృందం, ఫీల్డ్ యూనిట్, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందన్నారు. పేలుడు ధాటికి పోలీస్ ఔట్ పోస్ట్ కిటికీ అద్దాలు పగిలి, గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి.
ఈ పేలుడులో అక్కడికి ఆహారం అందించడానికి వచ్చిన డెలివరీ ఉద్యోగికి గాజు ముక్కలు తగిలి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ సహా పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై విచారణ చేపట్టాయి. సోషల్ మీడియాలో ఓ సంస్థ పేలుడుకు బాధ్యత వహిస్తూ చేసిన ప్రకటనను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, పేలుడులో పేలుడు పదార్థాలు ఉపయోగించారా లేదా అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు.











