హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఎల్బీనగర్హయత్నగర్ మధ్య 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు.
గుజరాత్‌లోని ఏక్తానగర్లో జరుగుతున్న రెండు రోజుల చింతన్ శిబిర్ సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించారు. ముఖ్యంగా, ఎల్బీనగర్హయత్నగర్ మార్గంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ కారిడార్‌ను 202627 వార్షిక ప్రణాళికలో చేర్చి మంజూరు చేయాలని కోరారు.
భవిష్యత్తులో మియాపూర్ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని హయత్‌నగర్ వరకు విస్తరించే ప్రతిపాదనకు అనుగుణంగా ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను రూపొందించాలని సూచించారు. అలాగే, ఎన్‌హెచ్65లోని ఎల్బీనగర్మల్కాపూర్ మార్గంలో ప్రతిపాదించిన రీన్ఫోర్స్డ్ ఎర్త్ గోడకు బదులుగా వయాడక్ట్ విధానాన్ని అవలంబించాలని కోరారు. దీనివల్ల పెద్దఎత్తున ఆస్తుల సేకరణ అవసరం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణతో రహదారి మౌలిక వసతులను సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు.
ఇతర కీలక ప్రాజెక్టులపై దృష్టి
ఇదే సమయంలో హైదరాబాద్మచిలీపట్నం జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ నుంచి తుది ఆమోదం ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ మార్గంలో రోజువారీ రాకపోకలు 1.20 లక్షల ప్యాసింజర్ కార్ యూనిట్లకు మించి పెరిగాయని, పలు ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్స్పాట్లు ఉన్నందున విస్తరణను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న 161.5 కిలోమీటర్ల ఉత్తర ప్రాంతీయ రింగ్ రోడ్డు సంగారెడ్డిచౌటుప్పల్ విభాగానికి ఆర్థిక, కేబినెట్ అనుమతులను త్వరగా ఇవ్వాలని కూడా కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డులు పూర్తయ్యాయని, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. దక్షిణ ప్రాంతీయ రింగ్ రోడ్డును కూడా ఇదే తరహాలో చేపట్టాలని కోరారు.
భవిష్యత్తు ప్రణాళికలు
దక్షిణ ప్రాంతీయ రింగ్ రోడ్డు భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక ప్రాంతాలు, రేడియల్ రహదారుల అభివృద్ధికి కీలకంగా ఉంటుందని మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రతిపాదిత డ్రైపోర్టును ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్టుతో అనుసంధానించే హైస్పీడ్ సరకు రవాణా మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా వేగవంతం చేయాలని కోరారు.
రోప్‌వేలు, వంతెనల ప్రాజెక్టులకు నిధులు
రాష్ట్రంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఐదు పర్యావరణహిత రోప్‌వే ప్రాజెక్టులకు రూ.1,230 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోరారు. యాదాద్రి, హనుమాన్ హిల్, నాగార్జునసాగర్, రామగిరి కోట, నిజామాబాద్‌లోని కిల్లా రామాలయం ప్రాంతాలను అనుసంధానించేలా ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించారు.








